కావాలనుకుంటే పాకిస్థాన్ కు వెళ్లిపోండి: ఫరూక్ అబ్దుల్లా‌పై సంజయ్ రౌత్ ఫైర్

  • ఆర్టికల్ 370ని మళ్లీ సాధిస్తామని ఫరూక్ వ్యాఖ్యలు
  • ఇండియాలో వాటికి స్థానం లేదన్న సంజయ్ రౌత్
  • పాకిస్థాన్ కు వెళ్లి వాటిని అమలు చేసుకోవాలని ఎద్దేవా
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రజలకు రాజ్యాంగపరమైన హక్కులు మళ్లీ సంక్రమించేంత వరకు తన పోరాటం ఆగదని... అప్పటి వరకు తాను తనువు చాలించనని ఇటీవల ఫరూక్ వ్యాఖ్యానించారు. తన ప్రజల కోసం తాను ఏదో ఒకటి చేయక మాననని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన దేశంలో ఆర్టికల్ 370, 35ఏకు స్థానం లేదని సంజయ్ రౌత్ అన్నారు. కావాలనుకుంటే ఫరూక్ పాకిస్థాన్ కు వెళ్లిపోవచ్చని చెప్పారు. ఆ దేశంలో వాటిని అమలు చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్ పాకిస్థాన్ లో చేరాలని అనుకుని ఉంటే 1947లోనే అది జరిగేదని తెలిపారు. కానీ షేక్ అబ్దుల్లా వంటి గొప్ప నాయకుడు ఇండియాతో కలిశారని చెప్పారు. మరోవైపు బీజేపీపై కూడా సంజయ్ విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు ఆ పార్టీ తప్పుడు హామీలు ఇస్తోందని దుయ్యబట్టారు.


More Telugu News