ముస్లింలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు: బీజేపీ ఎంపీ అరవింద్

  • రైతులకు ఇచ్చిన హామీని కేసీఆర్ తప్పారు
  • కేసీఆర్ తీరుతో ప్రభుత్వాలపై రైతులకు నమ్మకం పోతోంది
  • కేసీఆర్ తప్పుడు నిర్ణయాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు. రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు రైతులను ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయని చెప్పారు.

దుబ్బాక ఎన్నికల ముందు మక్కలకు రూ. 100 నుంచి 150 ఎక్కువ ఇస్తానని కేసీఆర్ అబద్ధాలు చెప్పారని అన్నారు. సన్న రకం సాగు చేయాలని, మంచి ధర ఇస్తామని రైతులకు కేసీఆర్ చెప్పారని... ఆ తర్వాత మాట తప్పారని చెప్పారు. పౌల్ట్రీ యజమానుల కోసం మక్క రైతులను, రైస్ మిల్లర్ల కోసం వరి రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

రైతులను రైస్ మిల్లర్లు దోచుకుంటున్నారని అరవింద్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కనీస మద్దతు ధర కంటే కేసీఆర్ ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ తీరుతో ప్రభుత్వాలపై రైతులకు నమ్మకం పోతోందని అన్నారు. ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఇస్తోందని... అయినా వారిని కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ అప్పుల్లో ముంచేసిందని మండిపడ్డారు.


More Telugu News