అవకాశం రావాలే గానీ అసెంబ్లీ, సచివాలయాన్ని కూడా పేకాట క్లబ్ గా మార్చేందుకు శ్రీదేవి రెడీగా ఉన్నారు: అనిత

  • తాడికొండ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు
  • పేకాట క్లబ్బుల నిర్వహణ ఆరోపణలతో ఆడియో క్లిప్పింగ్ రిలీజ్
  • శ్రీదేవి ఎమ్మెల్యేగా అనర్హురాలన్న అనిత
  • సీఎం స్పందించాలని డిమాండ్
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఆ పార్టీ బహిష్కృత నేత సందీప్ చేస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఊరికి దూరంగా తోటల్లో పేకాట ఆడించే విషయంలో శ్రీదేవి... సందీప్ సలహా కోరుతున్నట్టుగా ఆ ఆడియోలో ఉంది. దీనిపై టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. గౌరవప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి పేకాట క్లబ్బులు నిర్వహించడం వైసీపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

ఊరూ, వాడా పేకాట క్లబ్బులు ఏర్పాటు చేసి గుల్ల చేస్తున్నారని, అవకాశం రావాలే గానీ ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ లో కూడా పేకాట ఆడించేందుకు ఉండవల్లి శ్రీదేవి రెడీగా ఉన్నారని విమర్శించారు. తాడికొండ నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి పేకాట క్లబ్ లపై పడిన ఎమ్మెల్యే శ్రీదేవిపై కేసు నమోదు చేయాలని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనిత డిమాండ్ చేశారు. పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్న శ్రీదేవి ఎమ్మెల్యేగా అనర్హురాలని స్పష్టం చేశారు.

మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న ఆడియో క్లిప్పింగ్ పై రాష్ట్ర సర్కారు వెంటనే స్పందించి విచారణ జరిపించాలని అన్నారు. పేకాట క్లబ్బులు నిర్వహించడంపై స్వయంగా ఎమ్మెల్యేనే చెప్పడంపై సీఎం స్పందించాలని అనిత వ్యాఖ్యానించారు.

ఇప్పుడు వాటాల పంపిణీలో విభేదాలు రావడంతోనే తనకు ప్రాణహాని ఉందంటూ ఎమ్మెల్యే శ్రీదేవి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోటాపోటీగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చుతున్నారని విమర్శించారు.


More Telugu News