న్యాయమూర్తులపై జగన్ ఆరోపణల లేఖ బహిర్గతంపై.. 16న సుప్రీంకోర్టు విచారణ

  • హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సీజేఐకి జగన్ ఫిర్యాదు
  • లేఖను బహిర్గతం చేయడాన్ని సవాలు చేసిన న్యాయవాదులు
  • జగన్ ముఖ్య సలహాదారు అజేయ కల్లంపై చర్యల కోసం ఏజేకు లేఖ
హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల లేఖ రాయడమే కాకుండా, దానిని మీడియాకు విడుదల చేయడం తీవ్ర కలకలం రేపింది. లేఖను బహిర్గతం చేయడంపై జాతీయ స్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు, లేఖను బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లు ఈ నెల 16న విచారణకు రానున్నాయి.

కోర్టులపై అసత్య ఆరోపణలు చేయకుండా ప్రతివాదిపై చర్యలు తీసుకోవాలని, షోకాజ్ నోటీసులు ఇవ్వాలని న్యాయవాది సునీల్ కుమార్ పిటిషన్ వేయగా; సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేసినందుకు జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని మరో న్యాయవాది జీఎస్ మణి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీరితోపాటు న్యాయవాది ప్రదీప్‌కుమార్ సింగ్‌, యాంటీకరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ వేసిన పిటిషన్లను జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్రభట్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.  

కాగా, ఇదే వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లంపై కోర్టు ధిక్కరణ ప్రక్రియ మొదలుపెట్టేందుకు తనకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్ రాసిన లేఖపై అటార్నీ జనరల్ (ఏజే) కేకే వేణుగోపాల్‌ స్పందించారు. ప్రస్తుతం ఈ విషయం సీజేఐ పరిధిలో ఉండడం వల్ల తాను అనుమతి ఇవ్వలేనని తెలియజేశారు.

దీనికి స్పందించిన అశ్వినీ కుమార్ ఏజేకు మరో లేఖ రాస్తూ సీజేఐ పరిధిలో ఉన్నది జగన్ రాసిన లేఖ మాత్రమేనని, అది కోర్టు పరిధిలోకి వస్తుందంటూ తాను చేసిన ఫిర్యాదు కాదని స్పష్టం చేశారు. కాబట్టి కోర్టు ధిక్కరణ ప్రక్రియకు అనుమతి ఇవ్వాలని అశ్వినీ కుమార్ మరోసారి కోరారు.


More Telugu News