'మానవత్వమే నా మతం' పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

  • జగన్ జీవితంలోని మానవీయ అంశాల ఆధారంగా పుస్తకం
  • పుస్తకాన్ని రూపొందించిన గాంధీ పథం మ్యాగజైన్
  • పాదయాత్రకు మూడేళ్లు నిండిన సందర్భంగా పుస్తకావిష్కరణ
సీఎం జగన్ బాల్యం నుంచి ప్రజాసంకల్ప పాదయాత్రలోని ఉదాత్తమైన ఘటనల వరకు అనేక అంశాల సమాహారంగా వచ్చిన పుస్తకం 'మానవత్వమే నా మతం'. నేటికి వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా 'గాంధీ పథం' మ్యాగజైన్ 'మానవత్వమే నా మతం' పేరిట ఈ మేరకు ప్రత్యేక పుస్తకం తీసుకువచ్చింది. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ నేడు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, 'గాంధీ పథం' మ్యాగజైన్ ఎడిటర్ ఎన్.పద్మజ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 'గాంధీ పథం' పక్షపత్రిక ఎడిటర్ పద్మజ మాట్లాడుతూ, వైఎస్ జగన్ జీవితంలో అనేక అంశాలను ఇందులో పొందుపరిచామని చెప్పారు. బాల్యం నుంచే ఆపన్నులను ఆదుకునే వైఖరి, పాదయాత్రలో ఒక వృద్ధురాలి చెప్పు తెగిపోతే స్వయంగా ఆ చెప్పును సరిచేసి ఇవ్వడం వంటి అనేక అంశాలు తమ పుస్తకంలో ఉన్నాయని వివరించారు. 'మానవత్వమే నా మతం' పుస్తకం సీఎం జగన్ లోని మానవీయకోణాన్ని ఆవిష్కరిస్తుందని తెలిపారు.


More Telugu News