భారత మార్కెట్లోకి 'మెటియోర్ 350' బైక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్

  • థండర్ బర్డ్ 350 ఎక్స్ ను భర్తీ చేయనున్న మెటియోర్
  • ప్రారంభ ధర రూ.1.75 లక్షలు
  • మూడేళ్ల వారంటీ!
రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిళ్లను రాజసానికి మారుపేరుగా భావిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ కు ఉన్న ప్రజాదరణ అంతాఇంతా కాదు. ఇక క్రూయిజర్ బైక్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ ఫీల్డ్ మెటియోర్ పేరుతో కొత్త బండిని నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది 349 సీసీ బైక్. గతంలో ఉన్న థండర్ బర్డ్ 350 ఎక్స్ బైక్ ను ఇది భర్తీ చేస్తుంది.

బీఎస్ 6 ప్రమాణాలతో తయారైన మెటియోర్ 350 ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ అమర్చారు. ఇందులో 5 స్పీడ్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ ఉంటుంది. ప్రస్తుతానికి ఇది ఫైర్ బాల్, స్టెల్లార్, సూపర్ నోవా వేరియంట్లలో వచ్చింది. మెటియోర్ 7 రంగుల్లో లభ్యమవుతుంది.

దీంట్లో ప్రారంభ మోడల్ ఫైర్ బాల్ చెన్నైలో ఎక్స్ షోరూమ్ ధర రూ.1.75 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ సూపర్ నోవా ధర రూ.1.90 లక్షలు. బైక్ పై మూడేళ్ల వారంటీ ఇస్తున్నారు!

ఫీచర్ల విషయానికొస్తే... గూగుల్ మ్యాప్స్ సహకారంతో టిప్పర్ నేవిగేషన్ వ్యవస్థను అమర్చారు. దీని సాయంతో బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ ను బైక్ తో అనుసంధానం చేయొచ్చు. శక్తిమంతమైన హాలోజెన్ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, టెయిల్ ల్యాంప్ లు పొందుపరిచారు. డిస్ ప్లే చూస్తే ట్విన్ పాడ్ క్లస్టర్ కన్సోల్ ఇచ్చారు. ఓడోమీటర్, ఫ్యూయెల్ గ్రాఫ్ బార్, సర్వీస్ రిమైండర్, ట్రిప్ మీటర్ ఇతర ఫీచర్లు.


More Telugu News