అమృతప్రణయ గాథ 'మర్డర్‌' సినిమా విడుదలకు కోర్టు అనుమతి.. రామ్ గోపాల్ వర్మ హర్షం

  • కొన్ని రోజుల క్రితం సినిమా విడుదలపై కోర్టు స్టే
  • తాజాగా ఈ స్టేను ఎత్తివేసిన న్యాయస్థానం 
  • మారుతీరావు, అమృత, ప్రణయ్‌ ఫొటోలు వాడొద్దని ఆదేశాలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్యోదంతం ఆధారంగా  'మారుతి రాసిన అమృతప్రణయ గాథ' అంటూ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ సినిమా తీసిన విషయం తెలిసిందే. అయితే, ప్రణయ్‌ భార్య అమృత ఈ సినిమాను నిలిపివేయాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం కోర్టులో పిటిషన్‌ వేయడం జరిగింది. కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది కాబట్టి, ఇలాంటి సమయంలో కల్పిత కథతో ఉన్న ఈ సినిమా విడుదలైతే సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది.

దీంతో నల్లగొండ కోర్టు అప్పట్లో ఈ సినిమా విడుదలపై స్టే విధించింది.  దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణకు అత్యవసర నోటీసులు జారీ చేస్తూ కేసు తదుపరి విచారణను కూడా జరిపింది. అయితే, ఈ రోజు కోర్టు ఈ స్టేను ఎత్తివేసింది.

మారుతీరావు, అమృత, ప్రణయ్‌ ఫొటోలు వాడకుండా సినిమాను విడుదల చేసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఆర్జీవీ ట్విట్టర్‌ ద్వారా హర్షం వ్యక్తం చేస్తూ కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే చెబుతానని అన్నారు. కాగా, ఆనంద్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.


More Telugu News