ఏపీలో మెడికల్ కోర్సుల ఫీజులు సవరించిన ప్రభుత్వం

  • ఇకపై నాలుగున్నరేళ్లకు మాత్రమే ఫీజు
  • 2020-21 నుంచి 2022-23 వరకు అమల్లో తాజా ఫీజులు
  • ఉత్తర్వులు విడుదల చేసిన అనిల్ కుమార్ సింఘాల్
మెడికల్ కాలేజీ ఫీజుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద చదువుకునే ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు ఊరట కల్పిస్తూ ఫీజులను సవరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం.. ఎంబీబీఎస్‌కు ఇప్పటి వరకు ఐదేళ్ల కాలానికి ఫీజు వసూలు చేస్తుండగా, ఇకపై నాలుగున్నరేళ్లకు మాత్రమే ఫీజు తీసుకోనున్నారు. తాజా ఫీజులు 2020-21 నుంచి 2022-23 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

గతంలో రూ. 12,155గా ఉన్న ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీజును రూ. 15 వేలకు పెంచగా, రూ. 13,37,057గా ఉన్న బి కేటగిరీ ఫీజును రూ. 12 లక్షలకు తగ్గించారు. సి కేటగిరీ ఫీజు ఇప్పటి వరకు రూ. 33,07,500గా ఉండగా,  ఇప్పుడు దానిని రూ. 36 లక్షలకు పెంచారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజును రూ. 15 లక్షలుగా సవరించారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ కళాశాలలకు నూతన ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇతరత్రా ఫీజుల పేరుతో ఇంతకుమించి వసూలు చేసే కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.


More Telugu News