నాలుగ్గోడల మధ్య జరిగే దూషణకు ఈ చట్టాన్ని వర్తింపజేయలేం: ఎస్సీ, ఎస్టీ చట్టం కేసు విషయంలో సుప్రీంకోర్టు  

  • ఓ కేసును విచారించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం
  • ఎస్సీ లేదా ఎస్టీ అయినంత మాత్రాన చట్టాన్ని వర్తింపజేయలేం
  • కేసును కొట్టివేస్తున్నట్టు వెల్లడి
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారిని నాలుగు గోడల మధ్యా దూషించారనే ఆరోపణలకు సాక్ష్యాలు లేకుంటే కనుక దాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, హేమంత్ గుప్తా, అజయ్ రస్తోగిలతో కూడిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఓ మహిళ తనను వేధించారంటూ ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఓ వ్యక్తిపై కేసు పెట్టగా, అది అత్యున్నత ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. బాధితురాలు ఎస్సీ లేదా ఎస్టీ అయినంత మాత్రాన అన్ని రకాల వివాదాలు, అవమానాలను అదే చట్టం కింద విచారించలేమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. బాధితులు ప్రజల మధ్య అవమానించబడితే మాత్రం సదరు చట్టాలు వర్తించి తీరుతాయని, అలాంటి కేసుల్లోనే ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిపై ఎస్టీ చట్టం 1989, సెక్షన్ 3(1) కింద పెట్టిన కేసు చెల్లదని బెంచ్ తీర్పిచ్చింది.

ఇదే నేరం భవంతి బయట ఉన్న తోట వంటి ప్రదేశాల్లో నలుగురూ చూసేలా ఉన్న చోట లేదా బయటి నుంచి కనిపిస్తూ, వినిపిస్తూ ఉన్న ప్రాంతంలో జరిగితే దాన్ని నేరంగా పరిగణించవచ్చని, కానీ, ఈ కేసు ఎఫ్ఐఆర్ లో మహిళను నాలుగ్గోడల మధ్య తిట్టినట్టుగా ఉందని, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరని దీంతో నేరంగా పరిగణించేందుకు వీల్లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.


More Telugu News