కరోనా వైరస్‌కు అడ్డుకట్ట.. ఢిల్లీలో దీపావళి టపాసులపై నిషేధం!

  • ప్రభుత్వమే లక్ష్మీపూజ నిర్వహిస్తుంది
  • అందరం కలిసే దీపావళి జరుపుకుందాం
  • పొగ కారణంగా సంభవించే మరణాలకు ఇదే ఆఖరు కావాలి
  • ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపు 
దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యానికి తోడు, కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సమీపిస్తున్న వేళ టపాకాయలపై నిషేధం విధించాలని దాదాపు ఓ నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితి, సన్నద్ధతపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి కేజ్రీవాల్  మీడియాతో మాట్లాదారు.

 దీపావళి రోజున ఢిల్లీ ప్రజలు ఎవరూ టపాసులు కాల్చవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో లక్ష్మీపూజ నిర్వహిస్తామని, అందరం కలిసే దీపావళి జరుపుకుందామని అన్నారు. పండుగ రోజున (నవంబరు 14న) ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లల్లోని  టీవీల్లో లక్ష్మీపూజ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించాలని కోరారు. కుటుంబ సభ్యులందరూ కలిసి పూజలో పాల్గొనాలన్నారు.

గతేడాదిలానే ఈసారి కూడా టపాసులు కాల్చకుండానే దీపావళి జరుపుకుందామని సీఎం అన్నారు. నగరంలో వాయుకాలుష్యం, కరోనా వైరస్ నేపథ్యంలో టపాసులు కాల్చడం వల్ల పిల్లల ఆరోగ్యం పాడవుతుందన్నారు. ఢిల్లీలో పొగ కారణంగా సంభవించే మరణాలకు ఇదే ఆఖరు కావాలని ఆకాంక్షించారు.

ఢిల్లీలో వాయుకాలుష్యం పెరగడానికి పంజాబ్, హర్యానాలలో రైతులు వరి దుబ్బులను తగలబెట్టడమే కారణమని ఆరోపించారు. అంతేకాదు, ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు పెరగడానికి కూడా అదే కారణమన్నారు. ఐసీయూలో పడకల పెంపుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిందని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పేర్కొన్న కేజ్రీవాల్.. నగరంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేస్తుందని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News