బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది?: దీదీని ఆమె సొంతగడ్డ మీదే ప్రశ్నించిన అమిత్ షా

  • రెండ్రోజుల పర్యటన కోసం బెంగాల్ వెళ్లిన అమిత్ షా
  • బీజేపీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయంటూ ఆగ్రహం
  • తృణమూల్ అరాచకాల పార్టీ అంటూ ధ్వజం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండ్రోజుల పర్యటన కోసం పశ్చిమ బెంగాల్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు. తాను బెంగాల్ పర్యటనకు వచ్చింది బీజేపీ కార్యకలాపాలను పరిశీలించేందుకేనని, కానీ ఇక్కడికి వచ్చాక ప్రజల మనోభావాలను గమనిస్తే, అత్యవసరంగా మార్పును కోరుకుంటున్న విషయం అర్థమవుతోందని అన్నారు.

రాష్ట్రంలో మార్పు కావాలంటున్న ప్రజలు ఎన్నికల కోసం రాజకీయ పార్టీల కంటే ఎక్కువ తొందరపడుతున్నారని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం చూస్తున్నానని, అయితే మోదీ తమ సమస్యలను పరిష్కరిస్తారన్న ఆశాభావం వారిలో కనిపిస్తోందని తెలిపారు.

"కేంద్ర హోంమంత్రిగా ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను. కానీ ఓ బీజేపీ నేతగా మాట్లాడుతున్నాను... పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎప్పుడైతే విస్తరణకు ప్రణాళికలు రూపొందించుకుందే అప్పటి నుంచే మా కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలు ఎక్కువయ్యాయి. 100 మందికి పైగా బీజేపీ కార్యకర్తలను చంపేశారు. ఒక్క ఎఫ్ఐఆర్ లేదు, ఒక్క అరెస్టు లేదు. బెంగాల్ లో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి? దేశంలో ఇంత క్షీణస్థితిలో లా అండ్ ఆర్డర్ ఉండడం మరే రాష్ట్రంలోనూ చూడలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇంతకంటే దారుణ వైఫల్యం మరొకటి ఉండదేమో!" అని వ్యాఖ్యానించారు.


More Telugu News