బీహార్ లో నాకు నితీశ్ కుమార్ ప్రభుత్వమే కావాలి: ప్రధాని మోదీ ఆకాంక్ష

  • చివరిదశ పోలింగ్ కు సిద్ధమైన బీహార్
  • 78 నియోజకవర్గాల్లో పోలింగ్
  • నితీశ్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమన్న మోదీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు విడతల పోలింగ్ ముగియగా, మూడోది, చివరిదైన పోలింగ్ ఎల్లుండి జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం నితీశ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ బీహార్ ప్రజలకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీహార్ అభివృద్ధి చెందాలంటే నితీశ్ కుమార్ ప్రభుత్వం మళ్లీ రావాలని అక్కడి ప్రజలకు సూచించారు. తద్వారా ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీయూకే ఓటేయమని చెప్పారు.

"బీహార్ అభివృద్ధికి భరోసాగా నిలిచేందుకు నాకు నితీశ్ కుమార్ ప్రభుత్వం కావాలి. కొద్దికాలంలోనే పట్టాలు తప్పే ప్రభుత్వం వద్దు, సుదీర్ఘకాలం నిలిచే సర్కారు కావాలి" అని తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. బీహార్ లో భారీగా ఓటింగ్ జరుగుతోందన్న ప్రధాని... అక్కడ కులం ఆధారంగా ఓటింగ్ జరగడంలేదని, అభివృద్ధి కోసం ఓట్లు వేస్తున్నారని పేర్కొన్నారు.

"తప్పుడు హామీలకు ఓట్లు పడడంలేదు, రాజకీయ దృఢసంకల్పం ఉన్నవారికే ఓట్లు పడుతున్నాయి. చెడు పరిపాలన కోసం ఓట్లు వేయడంలేదు, సుపరిపాలన కోసం ఓట్లు వేస్తున్నారు. అవినీతి కోసం ఓట్లు వేయడంలేదు, నిజాయతీపరులను గెలిపించుకునేందుకు  ఓట్లు వేస్తున్నారు. అవకాశవాదం కోసం ఓట్లు వేయడంలేదు, స్వయం సమృద్ధి కోసం ఓట్లు వేస్తున్నారు. బీహార్ అభివృద్ధిపై నాకు సంతృప్తిగా ఉంది" అని ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.

బీహార్ లో చివరి దశ పోలింగ్ శనివారం జరగనుంది. ఉత్తర బీహార్ లోని 19 జిల్లాల్లో 78 నియోజవకర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.


More Telugu News