విదేశీ కార్మికులపై వివాదాస్పద ఆంక్షలు ఎత్తివేసిన సౌదీ సర్కారు

  • యజమానుల అనుమతి లేకుండా ఉద్యోగాలు మారే అవకాశం
  • మార్చి 14 నుంచి నూతన కార్మిక విధానం వర్తింపు
  • సౌదీలో 10.5 మిలియన్ల మంది విదేశీ కార్మికులు
అరబ్ దేశాలు కఠిన ఆంక్షలకు, కఠోర నియమ నిబంధనలకు పెట్టింది పేరు. సౌదీ అరేబియా కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే ఇటీవల కాలంలో అక్కడి పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో సౌదీ సర్కారు అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటోంది.

తాజాగా, విదేశీ కార్మికులపై ఇప్పటివరకు అమల్లో ఉన్న వివాదాస్పద ఆంక్షలు ఎత్తివేశారు. ఈ మేరకు కార్మిక విధానాన్ని సమూలంగా మార్చివేశారు. విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు, నిరుద్యోగితను తగ్గించేందుకు ఈ నిర్ణయాలు ఉపకరిస్తాయని సౌదీ అధికారులు భావిస్తున్నారు.

విదేశీయులు ఉద్యోగం మారాలన్నా, ఇతర దేశాలకు వెళ్లాలన్నా, శాశ్వతంగా దేశం విడిచి వెళ్లాలన్నా ఇకపై వారి యజమానుల అనుమతి తీసుకోనవసరం లేదు. ఈ కొత్త నిబంధనలు మార్చి 14 నుంచి వర్తిస్తాయని సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి శాఖ డిప్యూటీ మంత్రి సత్తామ్ అల్ హరాబి వెల్లడించారు.

ఇప్పటివరకు విదేశీ ఉద్యోగులపై 'కఫాలా' విధానం పేరిట దారుణమైన నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పాలి. యజమాని అనుమతి లేకుండా మరో ఉద్యోగంలో చేరితే ఆ ఉద్యోగి పారిపోయాడంటూ సదరు యజమాని ఫిర్యాదు దాఖలు చేసే అవకాశం ఉండేది. అంతేకాదు, ఆ  విధంగా వెళ్లిపోయిన వారిని పరారీలో ఉన్న వ్యక్తిగా పేర్కొని, వారిని తిరిగి రప్పించే అవకాశం అక్కడి ఉద్యోగ సంస్థలకు ఉండేది.

ఇప్పుడా పరిస్థితి పోయిందని, కొత్త నిబంధనలతో ఉద్యోగులు, కార్మికులు మరింత స్వేచ్ఛగా పనిచేసే వీలు కలుగుతుందని  అల్ హరాబి తెలిపారు. ప్రైవేటు రంగంలోని అందరు ఉద్యోగులకు వారి వేతనాలతో సంబంధం లేకుండా ఆ నూతన విధానం వర్తిస్తుందని  పేర్కొన్నారు. సౌదీలో ప్రస్తుతం 10.5 మిలియన్ల మంది విదేశీ కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. తాము నూతనంగా చేసిన మార్పులేవీ చిన్నవి కావని, చాలా పెద్ద మార్పులని అల్ హరాబి పేర్కొన్నారు. దీనిపై రెండేళ్లుగా కసరత్తు చేస్తున్నామని, సౌదీ కార్మిక, ఉద్యోగి రంగాన్ని మరింత ప్రభావవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు.


More Telugu News