తేజశ్వి ముందు నితీశ్ కుమార్ తల దించుకుని నిలబడతారు: చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు

  • నితీశ్ కు అధికార వ్యామోహం ఎక్కువ
  • అవసరమైతే లాలూ కాళ్లు మొక్కుతారు
  • 15 ఏళ్లుగా రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్ష సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్ ముందు నితీశ్ కుమార్ చేతులు కట్టుకుని, తల దించుకుని నిలబడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం మీద నితీశ్ కు ఉన్న వ్యామోహం అటువంటిదని అన్నారు.

గతంలో ప్రధాని మోదీని విమర్శించిన నితీశ్... ముఖ్యమంత్రి పదవి కోసం మోదీ ముందు తల దించారని చిరాగ్ చెప్పారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మోదీతో కలిసి వేదికను పంచుకుంటున్నారని... ఓటు వేయండని జనాలను మోదీ అడుగుతారని తల దించారా? అని ప్రశ్నించారు. అధికారం కోసం నితీశ్ ఏమైనా చేస్తారని చెప్పారు. 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెెలువడిన తర్వాత ఆర్జేడీ మద్దతు అవసరమని భావిస్తే... తేజశ్వి ముందు కూడా చేతులు కట్టుకుని నిలబడతారని అన్నారు. అవసరమైతే రాంచీకి వెళ్లి లాలూ ప్రసాద్ యాదవ్ కాళ్లు మొక్కి, ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుంటారని ఎద్దేవా చేశారు.

నితీశ్ కుమార్ చాలా బలహీనమైన ముఖ్యమంత్రి అని చిరాగ్ విమర్శించారు. 15 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ది సంగతి చూసుకుంటుందనే భావనలో ఆయన ఉంటారని... అలాంటప్పుడు ముఖ్యమంత్రి సీటులో ఆయన కూర్చోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నితీశ్ కుమార్ మరోసారి సీఎం కారనే విషయాన్ని తాను పేపర్ పై రాసిస్తానని అన్నారు. తాను కూడా ఏమీ చేయలేనని చెప్పారు. అయితే, అన్ని విషయాల్లో బీహార్ తొలి స్థానంలో ఉండాలనేదే తన కోరిక అని అన్నారు.


More Telugu News