15 సంవత్సరాలు డబుల్ ఇంజిన్ పాలన కొనసాగించారు: తేజశ్వి యాదవ్

  • నితీశ్ పాలనలో బీహార్ కు ఒరిగిందేమీ లేదు
  • జనాలకు ఒక్క మేలు కూడా చేయలేదు
  • కుల, మత తేడా లేని ప్రభుత్వాన్ని మనం నిర్మిద్దాం
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. 15 ఏళ్లుగా ఉన్న నితీశ్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువ నాయకుడు, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన సభలకు జనాల నుంచి విపరీతమైన ఆదరణ కూడా వస్తోంది. మరోవైపు, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం బీజేపీకి కూడా చాలా అవసరం. మోదీ నాయకత్వంపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉందని చెప్పుకోవడానికి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో, ఎన్నికల ప్రచారపర్వం సంగ్రామాన్ని తలపిస్తోంది.

తాజాగా సహర్సా ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి నితీశ్ పై తేజశ్వి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. 15 సంవత్సరాలుగా నితీశ్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ పాలన కొనసాగిందని ఎద్దేవా చేశారు. నితీశ్ పాలనలో బీహార్ లో ఏ మాత్రం అభివృద్ది జరగలేదని విమర్శించారు. జనాలకు ఒక్క మేలు కూడా చేయలేదని అన్నారు. రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ... ఆ పని చేయలేకపోయారని విమర్శించారు.

తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే 10 లక్షల పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తానని తేజశ్వి హామీ ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్ లో 22 శాతాన్ని విద్యకే కేటాయిస్తానని చెప్పారు. 15 ఏళ్లుగా నితీశ్ పట్టించుకోని రాష్ట్రానికి తాను మేలు చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వాన్ని నిర్మించేందుకు అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. కుల, మత భేదాలు లేని ప్రభుత్వాన్ని నిర్మిద్దామని అన్నారు.


More Telugu News