అమెరికాలో మొదలైన పోలింగ్... న్యూ హాంప్ షైర్ లో మొదటి ఓటు

  • అమెరికాలో నేడు అధ్యక్ష ఎన్నికల పోలింగ్
  • పోలింగ్ బూత్ లకు తరలివస్తున్న ఓటర్లు
  • గెలుపు మాదంటే మాది అంటున్న ట్రంప్, బైడెన్
యావత్ ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు ఘట్టం ప్రారంభమైంది. అగ్రరాజ్యంలో కొద్దిసేపటి కిందట పోలింగ్ ప్రారంభమైంది. మొదటి ఓటు న్యూ హాంప్ షైర్ లో పోలైంది. ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలివస్తున్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి అంకం ప్రచార కార్యక్రమాలు ముగించుకుని వైట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడి నుంచే పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.

మరోవైపు, డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్ తన విజయంపై ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా భారతీయ అమెరికన్లు తనకే మద్దతిస్తారని బలంగా నమ్ముతున్నారు. ఉపాధ్యక్ష పదవి కోసం భారత సంతతి మహిళ కమలా హారిస్ ను ఎంపిక చేసుకోవడంతోనే తన విజయం సగం ఖాయమైందని బైడెన్ విశ్వసిస్తున్నారు.

కాగా, పోలింగ్ కు ముందు ట్రంప్ తన మద్దతుదారులకు సందేశం అందించారు. "నా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మొదటి నుంచి మీరు నాతోనే ఉన్నారు. మీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను. మీ ఆశలే నా ఆశలుగా, మీ కలలే నా కలలుగా పాలన సాగిస్తాను. నేను ప్రతి దినం పోరాడేది మీ భవిష్యత్ కోసమే" అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


More Telugu News