లాక్ డౌన్ తరువాత తొలిసారి... రూ. 3 కోట్లకు చేరువైన హుండీ ఆదాయం, 25 వేలు దాటిన తిరుమల భక్తులు!

  • వారాంతంలో పెరుగుతున్న రద్దీ
  • కల్యాణం బుక్ చేసుకున్న వారి రాకతో పెరిగిన రద్దీ
  • పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామన్న టీటీడీ
శ్రీ వెంకటేశ్వరునికి నిలయమైన తిరుమల సప్తగిరులు, తిరిగి భక్తులతో కళకళలాడుతున్నాయి. మార్చిలో లాక్ డౌన్ కారణంగా దేవాలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేసిన తరువాత, దశలవారీగా భక్తులకు అనుమతిస్తుండటంతో, గత వారాంతంలో హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ఆలయం తలుపులను భక్తుల కోసం తిరిగి తెరిచిన తరువాత, తొలిసారిగా రూ.2.93 కోట్ల ఆదాయం లభించిందని, స్వామిని దర్శించుకున్న వారి సంఖ్య ఒక్కరోజులో 27,107గా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 

లాక్ డౌన్ తరువాత ఇంత పెద్దమొత్తంలో హుండీ ఆదాయం రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. అంతకుముందు స్వామివారిని రోజుకు 80 వేల నుంచి 90 వేల మంది, ఒక్కోరోజు దాదాపు లక్ష మంది వరకూ దర్శించుకునేవారు. అప్పట్లో ఆదాయం సగటున రోజుకు 4 కోట్లకు పైగానే లభించేది. కాగా, ఇటీవలి కాలంలో స్వామివారి కల్యాణాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు వారాంతంలో ఒక్కసారిగా స్వామి దర్శనానికి రావడంతోనే భక్తుల సంఖ్య అమాంతం పెరిగిందని టీటీడీ అధికారులు విశ్లేషించారు.

నిబంధనల మేరకు కరోనా వ్యాప్తి కాకుండా, కొండపై అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని, పరిమిత సంఖ్యలో భక్తులను అమతించాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో సైతం పరిమిత సంఖ్యలోనే టికెట్లను విక్రయిస్తున్నామని, అయితే, కల్యాణం చేయించుకున్న భక్తులు వారాంతంలో దర్శనానికి వస్తుండటంతోనే రద్దీ పెరుగుదలకు కారణమవుతోందని అంచనా వేశారు.


More Telugu News