అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం... ఏమిటీ పశువాంఛ?: పవన్ కల్యాణ్

  • చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం
  • మానవ మృగం కబళించి వేసిందన్న పవన్
  • బహిరంగ శిక్షలు రావాలని ఆకాంక్ష
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని రాయలపేటలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం... ఏమిటీ పశువాంఛ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. మృగాడి పైశాచికత్వానికి బలైపోయిన ఆ పసిబిడ్డ పరిస్థితి తలుచుకుంటేనే హృదయం బరువెక్కిపోతోందని, ఆ అభాగ్యురాలు ఇప్పుడు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోందని తెలిపారు.

అధిక రక్తస్రావం కారణంగా ఆ చిన్నారి పరిస్థితి దయనీయంగా ఉందని పలమనేరు వైద్యులు చెబుతున్న వీడియో చూసినప్పుడు కలిగిన ఆవేదన మాటలకు అందనిదని వ్యాఖ్యానించారు. ఆడుకోవడానికి పొరుగింటికి వెళితే 26 ఏళ్ల మానవమృగం ఆ పసిదాన్ని కబళించి వేసిందని తెలిపారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ చిన్నారి కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల కాలంలో ఏపీలో ఆడపిల్లలపై వరుసగా అకృత్యాలు జరుగుతున్నాయని పవన్ వెల్లడించారు. గాజువాకలో 17 ఏళ్ల బాలిక, విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని, విజయవాడలోనే మరో నర్సు... ఇలా రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయని ఆక్రోశం వ్యక్తం చేశారు. నిర్భయ, దిశ వంటి చట్టాలు ఉన్నా ఆడపడుచులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

"ఎప్పుడో పడే శిక్షలకు దుష్టులు భయపడడంలేదా? అలాగైతే నేరం చేయాలంటేనే భయపడే శిక్షలు రావాలి. ఆ శిక్షలు బహిరంగంగా అమలు కావాలి. దీనిపై మేధావులు, సామాజికవేత్తలు, మహిళా సంఘాలు ఎలుగెత్తాలి. లేకపోతే ఆడపిల్లలు బలైపోతూనే ఉంటారు" అని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News