అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్న షేన్ వాట్సన్

  • ఇక ఐపీఎల్ లో కనిపించని వాట్సన్ మెరుపులు
  • తాజా సీజన్ లో పేలవ ఆటతీరుతో విమర్శలు
  • అంతర్జాతీయ క్రికెట్ కు గతంలోనే వీడ్కోలు చెప్పిన వాట్సన్
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు తన ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కు తెలిపాడు. 2016లోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన వాట్సన్ తాజా నిర్ణయంతో ఐపీఎల్ నుంచి కూడా తప్పుకోనున్నాడు. యూఏఈ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ లో వాట్సన్ పేలవ ప్రదర్శన కనబరిచాడు.

వాట్సన్ వయసు 39 ఏళ్లు. ఐపీఎల్ లో చెన్నై జట్టు విజయాల్లో వాట్సన్ పాత్ర కీలకం. వాట్సన్ శుభారంభం అందించిన అనేక మ్యాచ్ లలో సూపర్ కింగ్స్ విజయభేరి మోగించారు. ముఖ్యంగా 2018 ఐపీఎల్ సీజన్ ఫైనల్లో 57 బంతుల్లోనే 117 పరుగుల ఇన్నింగ్స్ వాట్సన్ కెరీర్ లో ఓ ఆణిముత్యంలా నిలిచిపోతుంది. ఐపీఎల్ లో వాట్సన్ మొత్తం 3,874 పరుగులు చేసి, బౌలింగ్ లో 92 వికెట్లు తీశాడు.

కాగా, తన రిటైర్మెంటు నిర్ణయాన్ని వాట్సన్ అధికారికంగా ప్రకటించకపోయినా, సూపర్ కింగ్స్ యజమానులకు తెలియజేసినట్టు సమాచారం. ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడినా, స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ లేకపోవడంతో వాట్సన్ రిటైర్మెంటు నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది.


More Telugu News