టెన్షన్ టెన్షన్... ఐపీఎల్ ప్లేఆఫ్ ఎవరెవరికి... ఓ విశ్లేషణ!

  • నేడు బెంగళూరు, ఢిల్లీ మధ్య పోటీ
  • గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ అవకాశం
  • తుది బెర్తులను ఖరారు చేయనున్న రేపటి మ్యాచ్
  • హైదరాబాద్ జట్టుకు తప్పక గెలవాల్సిన పరిస్థితి
  • ముంబై గెలిస్తే మాత్రమే కోల్ కతాకు అవకాశం
ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీలు తుది అంకానికి వచ్చేశాయి. మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలున్నాయి. అయినా, ఇప్పటికీ, ముంబై ఇండియన్స్ కు మినహా మరే ఇతర జట్టుకూ ప్లే ఆఫ్ అవకాశాలు ఖరారు కాలేదు. గడచిన సంవత్సరాల్లో జరిగిన ఐపీఎల్ పోటీలతో పోలిస్తే, ఈ సంవత్సరం అభిమానులకు ఫుల్ టెన్షన్. ముంబైని వదిలేస్తే, మరో మూడు ప్లే ఆఫ్ బెర్తుల కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ సస్పెన్స్ రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్ వరకూ తేలేది లేదంటే సందేహం లేదు.

ఎందుకంటే, నేడు రెండో స్థానంలో ఉన్న బెంగళూరు, మూడవ స్థానంలో ఉన్న ఢిల్లీ జట్ల మధ్య పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు, 16 పాయింట్లను సాధించి కచ్చితంగా ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. ఇక ఓడిపోయిన జట్టు, కోల్ కతాకున్న నెట్ రన్ రేటు కన్నా దిగువకు వస్తే మాత్రం, ఆ జట్టుకు ప్రమాదమే. అంటే, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ ఓడిపోతే, విజయ లక్ష్యానికి సాధ్యమైనంత దగ్గరకు రావాల్సి వుంటుంది. అంటే, ఐదు, లేదా పది పరుగుల తేడాతో మాత్రమే ఓడిపోవాలి. 20 పరుగుల తేడాతో ఓడిపోతే మాత్రం కోల్ కతా జట్టుకు చాన్సులు పెరుగుతాయి. (ఇది తొలుత బ్యాటింగ్ చేసే జట్టు ప్రత్యర్థి ముందు ఉంచే లక్ష్యాన్ని బట్టి మారుతుంది)

ఇక, రేపటి మ్యాచ్ మరింత కీలకం. ఈ సీజన్ లో అదే చివరి లీగ్ మ్యాచ్. ముంబై, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ముంబై గెలిస్తే, మరే విధమైన అంచనాలకు తావులేకుండా ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతాలు ప్లే ఆఫ్స్ కు వెళ్లిపోతాయి. ఒక్క రెండు, మూడు ర్యాంకుల్లోనే తేడా వస్తుంది. అదే హైదరాబాద్ గెలిస్తే మాత్రం మరో రెండు జట్లలో... అంటే, నేడు ఓడిన జట్టుతో పాటు, కోల్ కతాకు కూడా ప్రమాదమే. ఎందుకంటే, ఇప్పటికే, 2, 3, 4 స్థానాల్లో ఉన్న జట్లతో పోలిస్తే, హైదరాబాద్ కు మెరుగైన నెట్ రన్ రేటు ఉంది.

బెంగళూరు జట్టు మైనస్ 0.145, ఢిల్లీ జట్టుకు మైనస్ 0.159, కోల్ కతాకు మైనస్ 0.214 నెట్ రన్ రేటు ఉండగా, హైదరాబాద్ పాజిటివ్ లో 0.555 రన్ రేటును కలిగివుంది. ఈ లెక్కల ప్రకారం, రేపు హైదరాబాద్ విజయం సాధిస్తే, కోల్ కతా జట్టు ఇంటికి వెళ్లే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అయితే, నేడు ఓడిపోయే జట్టు భారీ తేడాతో ఓటమి పాలై, కోల్ కతా కన్నా తక్కువ నెట్ రన్ రేటుకు పడిపోతే మాత్రమే మోర్గాన్ సేనకు అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో, ఈ రెండు మ్యాచ్ లూ కీలకమే.


More Telugu News