ప్రకాశం బ్యారేజీపై సీ ప్లేన్.. కేంద్రం ప్రణాళికలు

  • దేశంలోని మరిన్ని ప్రాంతాలకు సీ ప్లేన్ సేవలు విస్తరణ
  • ఏపీ సహా 14 చోట్ల వాటర్ ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని యోచన
  • జెట్టీలు నిర్మించాలంటూ ఏడబ్ల్యూఏఐని కోరిన ఏఏఐ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం గుజరాత్‌లోని కేవడియాలో ప్రారంభించిన సీ ప్లేన్ సర్వీసులను ఏపీకి కూడా విస్తరించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీని వాటర్ ఏరోడ్రోమ్‌గా మార్చాలని భావిస్తున్నట్టు సమాచారం. అలాగే, దేశంలోని మరో 13 చోట్ల కూడా ఇటువంటి విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లోని వివిధ మార్గాల్లో సీ ప్లేన్‌లు దిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్టు నౌకాయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

అలాగే, వాటర్ ఏరోడ్రోమ్ నుంచి ప్రయాణికులు బయటకు వచ్చేందుకు అవసరమైన జెట్టీలను ఏర్పాటు చేయడంలో సహకరించాలంటూ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు కలిసి భారత అంతర్గత జల మార్గాల ప్రాధికార సంస్థ (ఏడబ్ల్యూఏఐ)ను కోరాయి. కాగా, సీ ప్లేన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ ఐక్యతా శిల్పం నుంచి సబర్మతి రివర్‌ ఫ్రంట్ వరకు ప్రయాణించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 200 కిలోమీటర్లు కాగా, సీ ప్లేన్‌లో మోదీ 40 నిమిషాల్లోనే చేరుకున్నారు.


More Telugu News