గెలిచిన కోల్‌కతా.. రాజస్థాన్ ఇంటికి!

  • కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన రాజస్థాన్
  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన కోల్‌కతా
  • ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కైవసం చేసుకున్న కమిన్స్
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన మరో జట్టు ఇంటికెళ్లిపోయింది. నిన్న జరిగిన రెండు మ్యాచుల్లో మూడు జట్లు ఐపీఎల్ నుంచి నిష్క్రమించాయి. తొలుత చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా, ఇప్పటికే ఇంటి ముఖం పట్టిన చెన్నై ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా పంజాబ్ ఆశలను చిదిమేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతా ప్లే ఆఫ్స్ రేసులో నిలిచి, రాజస్థాన్‌ను ఇంటికి సాగనంపింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ పూర్తి ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం పాలైంది.

భారీ స్కోర్లను ఛేదిస్తూ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన రాజస్థాన్ కీలక మ్యాచ్‌లో మాత్రం కుప్పకూలింది. రాబిన్ ఉతప్ప (6), స్మిత్ (4), సంజు శాంసన్ (1), రియాన్ పరాగ్ (0) వంటివారు తీవ్రంగా నిరాశపరిచారు. టెయిలెండర్లు జోఫ్రా ఆర్చర్ 6, కార్తీక్ త్యాగి 2 పరుగులు చేశారు. స్టోక్స్ (18), జోస్ బట్లర్ (35), శ్రేయాస్ గోపాల్ (23) కాసేపు క్రీజులో ఉన్నప్పటికీ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా 131 పరుగుల వద్ద రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా 60 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చడంలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పాట్ కమిన్స్ కీలక పాత్ర పోషించాడు. 4 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచాడు. శివం మావి, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, కమలేశ్ నాగర్ కోటి ఒక వికెట్ తీసుకున్నాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 36, త్రిపాఠీ 39, రసెల్ 25, కమిన్స్ 15 పరుగులు చేశారు. కెప్టెన్ మోర్గాన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా మోర్గాన్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతాకు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో నితీశ్ రాణా, నరైన్, దినేశ్ కార్తీక్‌లు డకౌట్ అయ్యారు.

ఈ విజయంతో ప్లే ఆఫ్స్ రేసులోకి కోల్‌కతాకు సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది. ఆ జట్టుకు ప్రస్తుతం 12 పాయింట్లు ఉన్నాయి. రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. రేపు ముంబైతో జరిగే మ్యాచ్‌లో వార్నర్ సేన విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్ కారణంగా ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. నేడు ఢిల్లీ, బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో స్థానంతో నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.


More Telugu News