తన తండ్రి లాలు రికార్డు బద్దలు కొట్టిన తేజస్వి యాదవ్

  • బీహార్ లో ఎన్నికల కోలాహలం
  • తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్న తేజస్వి యాదవ్
  • ఇవాళ ఒక్కరోజే 19 సభలతో సరికొత్త రికార్డు
బీహార్ లోనే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు తేజస్వి ప్రసాద్ యాదవ్. మాజీ  సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల చిన్న కొడుకే ఈ తేజస్వి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అభ్యర్థులను విజయమార్గంలో నడిపేందుకు తేజస్వి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరికొన్నిరోజుల్లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, తేజస్వి సుడిగాలి వేగంతో ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో తన తండ్రి లాలూ పేరిట ఉన్న అత్యధిక బహిరంగ సభల రికార్డును తాజాగా బద్దలు కొట్టారు. ఇవాళ ఒక్కరోజే 19 సభలు నిర్వహించడం ద్వారా తేజస్వి సరికొత్త రికార్డు నెలకొల్పారు. వీటిలో 17 బహిరంగ సభలు, రెండు రోడ్ షోలు ఉన్నాయి. ఒక్కరోజులో ఇన్ని సభలు నిర్వహించిన ఘనత మరెవ్వరికీ లేదు. గతంలో లాలూ ఒక్కరోజులో 16 సభలు నిర్వహించారు. ఇప్పుడాయన రికార్డును కొడుకు తిరగరాయడం విశేషం.

ఈ ఉదయం  10.05 గంటలకు సీతామఢిలోని రిగా బ్లాక్ లో మొదటి సభ నిర్వహించిన తేజస్వి సాయంత్రం 4.45 గంటలకు తన చివరి సభను వైశాలి ప్రాంతంలోని బిదుపూర్ బ్లాక్ లో నిర్వహించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ రోజుకు మూడ్నాలుగు బహిరంగ సభలతో సరిపెడుతుండగా, తేజస్వి రోజుకు 14 నుంచి 16  సభలతో దూసుకుపోతున్నారు.


More Telugu News