దిశ చట్టం చేశాం, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న పాలకులు గాజువాక ఘటనపై ఏంచెబుతారు?: పవన్ కల్యాణ్

  • గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం
  • వరలక్ష్మి అనే విద్యార్థిని దారుణ హత్య
  • విద్యార్థిని కుటుంబ సభ్యులకు పవన్ ప్రగాఢ సానుభూతి
విశాఖపట్నం గాజువాకలో వరలక్ష్మి అనే విద్యార్థినిని అఖిల్ వెంకటసాయి అనే యువకుడు దారుణంగా హతమార్చడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. గాజువాకలో 17 ఏళ్ల బాలికపై ఓ ప్రేమోన్మాది దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. ఆ విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని, ఆ ఆడబిడ్డ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వేదనను ప్రభుత్వ అర్థం చేసుకోవాలని సూచించారు.

కొన్నిరోజుల కిందట విజయవాడలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి హత్యచేసిన దుర్మార్గాన్ని మరిచిపోకముందే, ఇప్పుడు గాజువాకలో అదే తరహా ఉన్మాద చర్య చోటుచేసుకోవడం దారుణమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులు, యువతులు, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించకూడదని హితవు పలికారు.

దిశ చట్టం చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం అని ప్రకటనలు చేసి ప్రచారం చేసుకున్న పాలకులు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెబుతారని పవన్ ప్రశ్నించారు. చట్టాలు చేశామని చేతులు దులుపుకుంటే ఏమిటి ప్రయోజనం అని పేర్కొన్నారు. దిశ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవడానికి కారణం ఏంటో ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి చేయాలని, యువతులకు, మహిళలకు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి చేయాలని సూచించారు.


More Telugu News