దుబ్బాకలో ముగిసిన ప్రచార హోరు... ఎల్లుండి పోలింగ్

  • దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
  • నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర
  • నవంబరు 3న పోలింగ్, 10వ తేదీన ఫలితాలు
సిద్ధిపేట జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా దుబ్బాకలో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రచారంతో హోరెత్తించాయి. ఇక ఎల్లుండి  పోలింగ్ జరగనుండగా, ఇవాళ సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. ఇప్పటివరకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం సాగించాయి.

దివంగత సోలిపేట రామలింగారెడ్డి అర్ధాంగి సోలిపేట సుజాత టీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉండగా,  బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో నవంబరు 3న పోలింగ్ జరగనుండగా, 10వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులతో సహా మొత్తం 23 మంది పోటీలో ఉన్నారు.


More Telugu News