రాష్ట్రం విడిపోయినా నవంబర్ 1 కొనసాగుతుంది: వైఎస్ జగన్

  • పొట్టి శ్రీరాములును ప్రతియేటా స్మరించుకుంటాం
  • అవతరణ దినోత్సవాన్ని కొనసాగించడం సంతోషదాయకం
  • విద్యను పేదలకు కూడా దగ్గర చేశాం
  • జెండా ఆవిష్కరణ అనంతరం వైఎస్ జగన్
తెలుగు ప్రజలకు ఓ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్షతో తన ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని ఎల్లకాలమూ స్మరించుకుంటూనే ఉంటామని, రాష్ట్రం విడిపోయినా, నవంబర్ 1ని ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవంగానే జరుపుతామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇండియాలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బాసట వేసిన శ్రీరాములు మహాశయాన్ని స్మరిస్తూ, తిరిగి అవతరణ దినోత్సవాన్ని కొనసాగించడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు.

ఈ ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆపై పొట్టి శ్రీరాములుకు చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఠారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.

ఆపై ప్రసంగించిన జగన్, ఏపీ ఆవిర్భవించి, నేటికి 64 సంవత్సరాలైందని గుర్తు చేశారు. శ్రీరాములు త్యాగఫలంతోనే రాష్ట్రం ఏర్పడిందని, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన 58 రోజుల దీక్ష చేశారని అన్నారు. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల కోరికలను, వారిలోని ఆకాంక్షలను గుర్తించానని, గ్రామాల రూపురేఖలను మారుస్తానని హామీ ఇచ్చారు. పాలనలో అవినీతికి తావు లేకుండా 17 నెలల పాటు పాలించామని, ఇదే విధమైన పాలనను భవిష్యత్తులోనూ అందిస్తూ, అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని అన్నారు.

చదువుకునేందుకు గతంలో ఆస్తులను అమ్మాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు పాఠశాలల రూపురేఖలను మార్చడంతో పాటు, పేదలకు కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని జగన్ వ్యాఖ్యానించారు. సొంత ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న 32 లక్షల కుటుంబాల కలలను త్వరలోనే నెరవేరుస్తామని తెలిపారు.

.


More Telugu News