అక్టోబర్ 13 నుంచి మృత్యువుతో పోరాటం... కన్నుమూసిన తమిళ మంత్రి దొరైక్కన్ను!

  • గత నెలలో కరోనా సోకి కావేరీ ఆసుపత్రిలో చేరిక
  • నిన్న పరామర్శించి వచ్చిన పళనిస్వామి
  • గత రాత్రి 11.15 గంటలకు తుదిశ్వాస
గత నెల 13వ తేదీన కరోనా సోకి, ఆసుపత్రిలో చేరిన వ్యవసాయ శాఖా మంత్రి ఆర్ దొరైక్కన్ను, మృత్యువుతో పోరాడుతూ ఓడిపోయారు. 72 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన ఆరోగ్యం విషమించి, చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత రాత్రి కన్నుమూశారు. తంజావూరు జిల్లాలోని పాపనాశం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

దొరైక్కన్ను మరణాన్ని ధ్రువీకరించిన కావేరీ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్, గత రాత్రి ఆయన తుది శ్వాస విడిచారని మెడికల్ బులిటన్ లో తెలిపారు. "బాధాతప్త హృదయంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. గౌరవనీయ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆర్. దొరైక్కన్ను శనివారం రాత్రి 11.15 గంటలకు కన్నుమూశారు" అని ఆయన తన ప్రకటనలో తెలిపారు. తమ వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేశారని అన్నారు.

దొరైక్కన్ను మృతిపట్ల తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పళని సెల్వమ్ తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రం వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందేందుకు గత నాలుగేళ్లుగా ఆయన ఎంతో కృషి చేశాడని కొనియాడారు. దొరైక్కన్ను మృతితో అన్నాడీఎంకే ఓ గొప్ప నేతను కోల్పోయిందని అన్నారు.

కాగా, దొరైకన్ను ఆరోగ్యం విషమిస్తోందని తెలుసుకున్న సీఎం పళనిస్వామి, శనివారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి, ఆయన్ను పరామర్శించి వచ్చారు. తాజాగా దొరైక్కన్ను కు సీటీ స్కాన్ నిర్వహించగా, ఊపిరితిత్తులు 90 శాతం చెడిపోయాయని, దీంతో ఆయనకు ఎక్మో సపోర్టును, వెంటిలేటర్ ను అమర్చాల్సి వచ్చిందని వైద్యులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.



More Telugu News