నన్నెవరూ అత్యాచారం చేయలేదు: మాటమార్చిన ఫోర్టిస్ హాస్పిటల్ ఐసీయూ బాధితురాలు!

  • గతవారం అత్యాచారంపై సమాచారం ఇచ్చిన యువతి
  • దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఘటన
  • విచారణలో అటువంటిదేమీ లేదని తేలిందన్న పోలీసులు
న్యూఢిల్లీ పరిధిలోని గురుగ్రామ్ లో ఉన్న ఫోర్టిస్ హాస్పిటల్ ఐసీయూలో తనపై అత్యాచారం జరిగిందని గతవారం సంచలన ఆరోపణలు చేసిన 21 సంవత్సరాల యువతి, ఇప్పుడు మాట మార్చింది. తనపై అత్యాచారం జరగలేదని బాధిత యువతి తమ విచారణలో స్పష్టం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ట్యూబర్ క్యూలోసిస్ వ్యాధితో బాధ పడుతున్న యువతి, చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరితే, ఆమెపై అత్యాచారం జరిగిందన్న వార్త గత వారం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

తొలుత తనపై జరిగిన అత్యాచార ఘటన గురించి తండ్రికి లేఖ పంపిన ఆమె, దాదాపు ఆరు రోజుల తరువాత స్పృహలోకి వచ్చి, పోలీసులకు వాగ్మూలం ఇస్తూ, తనపై రేప్ జరగలేదని స్పష్టం చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రి సీసీ కెమెరాలు సైతం ఇదే విషయాన్ని సష్టం చేశాయని తెలిపారు. కాగా, ఈ యువతి అక్టోబర్ 21న ఆసుపత్రిలో చేరగా, అప్పటికే శ్వాస తీసుకోలేకపోతున్న ఆమెకు వెంటిలేటర్ ను అమర్చి వైద్యులు చికిత్స చేశారు.

ఆపై 21 నుంచి 27 మధ్య వికాస్ అనే వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేశాడని, ఆ విషయాన్ని తన బిడ్డ స్వయంగా చెప్పిందని ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, పోలీసులు రంగంలోకి దిగారు. వికాస్ అనే వ్యక్తి ఆసుపత్రిలో పనిచేయడం లేదని, సీసీటీవీ కెమెరాలు పరీక్షిస్తే, అత్యాచారం ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు వెల్లడించారు. బాధితురాలు సైతం విచారణలో ఇదే విషయాన్ని వెల్లడించిందని తెలిపారు.



More Telugu News