కాంగ్రెస్ ఎందుకు క్షమాపణ చెప్పాలో అర్థం కావడం లేదు: బీజేపీకి శశిథరూర్ కౌంటర్

  • పుల్వామా దాడిలో పాక్ హస్తం ఉందన్న ఆ దేశ మంత్రి
  • గతంలో కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేసిందన్న బీజేపీ
  • దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారని మండిపాటు
గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ చేస్తున్న డిమాండ్ పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు  క్షమాపణ చెప్పాలో తనకు అర్థం కావడం లేదని అన్నారు. మన సైనికులను సురక్షితంగా ఉంచాలని కోరినందుకా? దేశం కోల్పోయిన దాని గురించి మాట్లాడకుండా, జాతీయజెండా గురించి మాట్లాడుతూ మీరు ప్రచారం చేసినందుకా? దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలను పరామర్శించినందుకా? దేనికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు.

పుల్వామా దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందంటూ ఆ దేశ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నిన్న మాట్లాడుతూ, పుల్వామా దాడి తర్వాత కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. పుల్వామా దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని అన్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై శశిథరూర్ స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News