నాకు కూడా దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయి: ఫాతిమా సనా షేక్

  • సెక్సువల్ ఫేవర్ చేయకపోతే కష్టమని చాలా మంది చెప్పారు
  • సెక్సిజం ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాలేదు
  • భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం ఉంది
సినీ పరిశ్రమలో నెలకొన్న లైంగిక వేధింపులపై ఇప్పటికే పలువురు నటీమణులు తన అనుభవాలను నిర్భయంగా వెల్లడించారు. కొందరు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లి ఫిర్యాదులు కూడా చేశారు. తాజాగా ఇదే అంశంపై బాలీవుడ్ నటి, అమీర్ ఖాన్ చిత్రం 'దంగల్' ఫేమ్ ఫాతిమా సనా షేక్ సంచలన విషయాలను వెల్లడించింది.

బాలీవుడ్ వెబ్ సైట్ పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫాతిమా మాట్లాడుతూ, సెక్సువల్ ఫేవర్స్ చేయకపోతే ఇండస్ట్రీలో నిలబడటం చాలా కష్టమని తనకు ఎంతో మంది చెప్పారని తెలిపింది. వారు చెప్పిన విధంగానే తనకు దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది. వాటికి తాను అంగీకరించకపోవడంతో... తనకు వచ్చిన ఎన్నో అవకాశాలను ఇతరులకు కోల్పోయానని తెలిపింది. సెక్సిజం అనేది కేవలం ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాలేదని... అన్ని రంగాల్లో ఇది ఉందని చెప్పింది. అన్ని రంగాల్లోని మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

'నా శరీరాన్ని అసభ్యంగా తాకిన అనుభవం నాకు ఐదేళ్ల వయసులో ఎదురైంది. కాదుకాదు.. అప్పటికి నాకు మూడేళ్లే. సెక్సిజం ఎంత దారుణంగా ఉంటుందో ఈ ఘటనతో అర్థం చేసుకోవచ్చు. రోజువారీగా మనం దీనిపై పోరాడుతూనే ఉంటాం. అయితే భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం మాత్రం నాకు ఉంది' అని ఫాతిమా తెలిసింది.

ఫాతిమా 1997లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. కమలహాసన్ చిత్రం 'చాచీ 420' లో ఆయన కుమార్తెగా నటించింది. 'దంగల్' సినిమాతో ఆమె స్టార్ గా అవతరించింది.


More Telugu News