విమానంలోనే తక్కువ... బయట తింటే ఎక్కువ!... కరోనా వ్యాప్తిపై హార్వర్డ్ వర్సిటీ అధ్యయనం

  • కరోనా కట్టడిలో విద్య, అవగాహన ముఖ్యమన్న పరిశోధకులు
  • జాగ్రత్త చర్యలు పాటిస్తే సంక్రమణ రేటు తగ్గుతుందని వెల్లడి
  • విమానయాన సంస్థలు ఎంతో శ్రమిస్తున్నాయని కితాబు
ప్రఖ్యాత హర్వర్డ్ యూనివర్సిటీకి చెందిన టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన పరిశోధకులు కరోనా వ్యాప్తిపై అధ్యయనం చేపట్టగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. విమానంలో ప్రయాణించే వారికంటే బయట తినేవారికి, సరుకుల కోసం దుకాణాలకు వెళ్లేవారికే కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

సరైన వెంటిలేషన్ సౌకర్యం కల్పించడం, శానిటైజ్ చేయడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, విధిగా మాస్కు ధరించడం వంటి జాగ్రత్త చర్యలతో విమానాల్లో కరోనా వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని, కానీ బయట రెస్టారెంట్లలో తినే సమయంలో, కిరాణ వస్తువుల కోసం షాపులకు వెళ్లిన సమయంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించలేమని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు.

కరోనా మహమ్మారిని అరికట్టే క్రమంలో విమానయాన సంస్థలు, ఎయిర్ పోర్టులు ప్రయాణికుల్లో అవగాహన కల్పించేందుకు ఎంతో శ్రమిస్తున్నాయని, వారి సిబ్బందికి కూడా ఆ విధంగా శిక్షణ ఇస్తున్నారని వివరించారు. విమాన ప్రయాణికులను కరోనా నివారణ చర్యలు పాటించేలా అవగాహన కల్పిస్తే వైరస్ వ్యాప్తి రేటు చాలా వరకు తగ్గిపోతుందని హార్వర్డ్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ వైరస్ ను అదుపు చేయడంలో విద్య, చైతన్యం ప్రముఖ పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. 'ఏవియేషన్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్' పేరిట ఈ అధ్యయనం వివరాలను పంచుకున్నారు.


More Telugu News