ఇలాంటి దమనకాండ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు: యనమల

  • టీడీపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం 
  • రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఉందా?
  • రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు
  • ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి
టీడీపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికమని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా ఇచ్చిన ‘చలో గుంటూరు’ పిలుపుమేరకు నిరసనలు తెలపడానికి వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు.

దీనిపై యనమల స్పందిస్తూ... ఏపీలో శాంతియుత నిరసనలు అడ్డుకోవడం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఉందా? అని ఆయన ప్రశ్నించారు.  దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని దమనకాండ ఏపీలో అమలవుతోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని అన్నారు.  రాజ్యాంగ హక్కులను హరించివేశారని, దరఖాస్తులు చేసినప్పటికీ నిరసనలకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని, అక్రమ గృహ నిర్బంధాలు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పారు. ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు.


More Telugu News