లక్షణాలు లేని కరోనా పేషెంట్లను గుర్తించే యాప్ రెడీ.. అమెరికా శాస్త్రవేత్తల ఆవిష్కరణ

  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేయనున్న యాప్
  • దగ్గు, పదాలను గుర్తించి లక్షణాలను చెప్పే యాప్
  • రికార్డ్ చేసి అప్ లోడ్ చేస్తే క్షణాల్లో రిపోర్ట్
కరోనా లక్షణాలు కనిపించకుండానే ఆ మహమ్మారి బారిన పడుతున్న వారు ఎంతో మంది ఉంటున్నారు. వారిలో ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించవు. టెస్టు చేయించుకుంటే మాత్రం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతుంది. వీరినే అసింప్టొమేటిక్ కోవిడ్-19 పేషెంట్లు అంటున్నారు. ఇలాంటి వారి కోసం శాస్త్రవేత్తలు కొత్తగా ఒక యాప్ ను తయారు చేశారు. స్మార్ట్ ఫోన్ లో ఉండే ఈ యాప్ ను వినియోగించి ఎవరైనా సరే తమలో అసింప్టొమేటిక్ లక్షణాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సంపూర్ణ ఆరోగ్యవంతుడికి, తనకు మధ్య ఉన్న తేడాను గమనించవచ్చు.

అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రీసర్చర్లు ఈ యాప్ ను అభివృద్ధి చేశారు. ఒక వ్యక్తి దగ్గే తీరు, పలికే పదాలను బట్టి... సదరు వ్యక్తి అసింప్టొమేటిక్ పేషెంటా? కాదా? అని యాప్ నిర్ధారిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యాప్ పని చేస్తుంది.

తమను తాము పరీక్షించుకోవాలనుకునే వారు ఏం చేయాలంటే... తమ దగ్గును, మాటలను వెబ్ బ్రౌజర్లు, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ డివైజెస్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వీటిని యాప్ తన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. తన వద్ద ఉన్న వేలాది దగ్గులు, పదాల ఉచ్చారణలతో పోల్చి... ఆ వ్యక్తికి కరోనా సోకిందా? అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. కరోనా పేషెంట్ల నుంచి రికార్డ్ చేసిన వేలాది దగ్గుల శబ్దాలను యాప్ లో ఫీడ్ చేశారు. కరోనా బారిన పడిన వారి 100 శాతం (అన్ని రకాలు) దగ్గులను ఇందులో చేర్చామని పరిశోధకులు తెలిపారు.

ఈ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామని పరిశోధకులు తెలిపారు. ఉచితంగా లేక తక్కువ రుసుముతో సేవలను అందించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యాప్ కచ్చితంగా ప్రజలకు ఎంతో మేలు చేసే అవకాశం ఉంది.


More Telugu News