పుల్వామా దాడి వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్న పాకిస్థాన్ మంత్రి

  • పుల్వామా దాడి వెనుక పాకిస్థాన్ ఉందన్న ఫవాద్
  • విమర్శల నేపథ్యంలో మాట మార్చిన వైనం
  • భారత్ మీడియా తన మాటలను వక్రీకరించిందని వ్యాఖ్య
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఆ దేశ శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి ఫవాద్ చౌధురి చెప్పడం కలకలం రేపింది. ఆ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసింది. పార్లమెంటు సాక్షిగా ఫవాద్ మాట్లాడుతూ, భారతదేశ భూభాగంలోకి వెళ్లి దాడి చేశామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీంతో, పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తముందని తాము చేస్తున్న ఆరోపణలు నిజమనే విషయం తేలిందని భారత్ వ్యాఖ్యానించింది.

వెంటనే పాకిస్థాన్ దిద్దుబాటు చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత భారత్ తో జరిగిన వైమానిక దాడి గురించే తాను మాట్లాడానని ఫవాద్ చెప్పారు. అమాయకులను చంపి తాము ధైర్యవంతులుగా చెప్పుకోదల్చుకోలేదని అన్నారు. ఉగ్రవాదానికి తాము ముందు నుంచి వ్యతిరేకమే అని చెప్పారు. తన మాటలను భారత మీడియా వక్రీకరించిందని అన్నారు. పుల్వామా దాడి చేయించింది పాకిస్థానే అని తాను అనలేదని చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.


More Telugu News