పెళ్లి వ్యాను బోల్తాపడి ఏడుగురు మరణించిన ఘటన మనసును కలచివేసింది: చంద్రబాబు, లోకేశ్

  • తంటికొండ ప్రమాదం దురదృష్టకరం
  • మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి
  • గాయపడినవారికి ప్రభుత్వం అత్యుత్తమ వైద్యాన్ని అందించాలి
  • మృతుల కుటుంబాలకు పరిహారమిచ్చి ఆదుకోవాలి
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ ఘాట్‌రోడ్డులోని వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఈ తెల్లవారుజామున పెళ్లి వ్యాను బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘తూర్పుగోదావరి జిల్లా తంటికొండ వెంకటేశ్వరాలయం వద్ద జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. శుభకార్యానికి వెళ్లొస్తూ ఇలా దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడినవారికి ప్రభుత్వం అత్యుత్తమ వైద్యాన్ని అందించాలి. అలాగే మృతుల కుటుంబాలకు తగిన పరిహారమిచ్చి ఆదుకోవాలి’ అని చంద్రబాబు అన్నారు.

మృతుల కుటుంబాలకు టీడీపీ నేత నారా లోకేశ్ సానుభూతి తెలిపారు. ‘తూర్పుగోదావరి జిల్లా తంటికొండ వెంకటేశ్వరాలయం వద్ద పెళ్లి వ్యాను బోల్తాపడి ఏడుగురు మరణించిన ఘటన మనసును కలచివేసింది. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున సాయమందించి ఆదుకోవాలి. అలాగే ప్రమాదంలో గాయపడిన వాళ్లకు మెరుగైన చికిత్సలు అందించాలి’ అని లోకేశ్ అన్నారు.


More Telugu News