బీహార్‌లో ప్రారంభమైన తొలి దశ ఎన్నికల పోలింగ్.. బరిలో పలువురు ప్రముఖులు

  • తొలి విడతలో 1,066 మంది అభ్యర్థులు
  • ఓటు హక్కును వినియోగించుకోనున్న 2 కోట్ల మంది
  • కొవిడ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు
మూడు విడతల్లో భాగంగా బీహార్‌లో నేడు తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 243 శాసనసభ స్థానాలకు గాను ఈ విడతలో 71 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1,066 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 952 మంది పురుషులు కాగా, 114 మంది మహిళలు ఉన్నారు. తొలి విడతలో మొత్తం 2 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటించి ఓటు వేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద గరిష్ఠంగా వెయ్యి మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. 80 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు.

తొలి విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కామన్‌వెల్త్ బంగారు పతక విజేత శ్రేయాషి సింగ్ (27) బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవగా, కేబినెట్ మంత్రులు ప్రేమ్ కుమార్ (బీజేపీ), విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ), రామ్ నారాయణ్ మండల్ (బీజేపీ), కృష్ణ నందన్ ప్రసాద్ వర్మ (జేడీయూ), జయకుమార్ సింగ్ (జేడీయూ), సంతోష్ కుమార్ నిరల (జేడీయూ) కూడా బరిలో ఉన్నారు. అలాగే, గయ జిల్లాలోని ఇమామ్ గంజ్ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థానీ అవామ్ మోర్చా చీఫ్ జితన్ రామ్ మాంజి ఎన్‌డీయే తరపున పోటీ చేస్తున్నారు.


More Telugu News