పదవి నుంచి తప్పుకున్న ఫేస్ బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ అధిపతి అంఖి దాస్

  • అంఖి దాస్ పై ఆరోపణలు
  • బీజేపీ అనుకూల వ్యక్తి అని ముద్ర
  • అంఖి దాస్ రాజీనామాను నిర్ధారించిన ఫేస్ బుక్
ఇటీవల కాలంలో ఫేస్ బుక్ లో విద్వేషపూరిత భావజాల వ్యాప్తి ఎక్కువ అవుతోందంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ నేతల అకౌంట్ల ద్వారా అభ్యంతరకర పోస్టులు వస్తున్నాయంటూ ఫేస్ బుక్ ఆంక్షలు విధించడం తరచుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ విభాగం అధిపతి అంఖి దాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె బీజేపీ అనుకూల వ్యక్తిగా ముద్రపడ్డారు.

బీజేపీ వాళ్ల పోస్టులను ఫేస్ బుక్ బ్లాక్ చేస్తుండడాన్ని ఆమె మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ నేతలపై ఫేస్ బుక్ విధిస్తున్న ఆంక్షలను వ్యతిరేకిస్తున్నారంటూ అంఖి దాస్ పై ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, ఆమె ఫేస్ బుక్ ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన గ్రూపులోనూ బీజేపీ అనుకూల పోస్టులు పెట్టేవారు. ఈ నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశం అయింది.

దీనిపై ఫేస్ బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ స్పందించారు. "ప్రజాసేవలో తన ఆసక్తిని కొనసాగించేందుకు వీలుగా అంఖి దాస్ ఫేస్ బుక్ లో తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఫేస్ బుక్ భారత్ లో ప్రవేశించిన తొలినాళ్ల నుంచి ఉన్న ఉద్యోగుల్లో అంఖి దాస్ ఒకరు. గత తొమ్మిదేళ్లకు పైగా కంపెనీ ఎదుగుదలలో ఆమె కీలక పాత్ర పోషించారు" అని వివరించారు.


More Telugu News