భారత్, అమెరికా మధ్య కుదిరిన 'బెకా' ఒప్పందం

  • ఢిల్లీలో ఇరుదేశాల మంత్రుల సమావేశం
  • 2+2 విధానంలో భేటీ
  • హాజరైన రాజ్ నాథ్, జైశంకర్, పాంపియో, ఎస్పర్
  • విస్తృతం కానున్న రక్షణ రంగ సంబంధాలు
రక్షణ రంగంలో భారత్, అమెరికా దేశాల మధ్య భాగస్వామ్యం మరింత విస్తృతమైంది. ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి తెరదీస్తూ కీలకమైన 'బెకా' ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇవాళ భారత, అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రుల 2+2 సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బేసిక్ ఎక్చేంజ్ అండ్ కోపరేషన్ అగ్రిమెంట్ (బెకా)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందం కుదిరిన దరిమిలా ఇకపై ఉపగ్రహాలు, సెన్సార్లు సేకరించే సమాచారాన్ని పంచుకునేందుకు ఇరుదేశాలకు వెసులుబాటు కలుగుతుంది. అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ, జియో స్పేషియల్ మ్యాప్ లు ఇచ్చిపుచ్చుకునేందుకు వీలవుతుంది. కాగా ఈ సమావేశంలో భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ పాల్గొన్నారు.

సమావేశం ముగిసిన అనంతరం రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ 'బెకా' ఒప్పందం కుదరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు సహా కీలకాంశాలపై సమగ్రంగా చర్చించామని వెల్లడించారు. ఇరుదేశాల సైన్యం మధ్య పరస్పర సహకారం క్రమంగా బలోపేతం కానుందని అన్నారు. ఇండో-పసిఫిక్ దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు భారత్, అమెరికా కట్టుబడి ఉన్నాయని రాజనాథ్ ఉద్ఘాటించారు. సమాచార మార్పిడికి 'బెకా' మార్గాలు తెరిచిందని వెల్లడించారు.

అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ మాట్లాడుతూ... ప్రపంచమంతా భద్రతాపరమైన సవాళ్లు నిండి ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ భద్రతకు, సుస్థిరతకు అమెరికా-భారత్ భాగస్వామ్యం అత్యవసరం అని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు, అస్థిరత నేపథ్యంలో కలిసి నడవాలని ఇరుదేశాలు నిర్ణయించాయని తెలిపారు. గతంతో  పోల్చితే రెండు దేశాల మధ్య మరింత మెరుగైన సైనిక సంబంధాలు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు.

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ 'బెకా' ఒప్పందం కుదరడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం చాలా ముఖ్యమని, ఈ దిశగా భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత దోహదం చేస్తాయని అన్నారు.

అటు, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో స్పందిస్తూ, రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి అభివృద్ధి చెందే అవకాశం ఈ ఒప్పందం ద్వారా లభిస్తుందని తెలిపారు. అయితే, ప్రపంచ రక్షణ అంశాలపై చైనా ప్రభావం, తదితర అంశాలపై తాము చర్చించాల్సి ఉందని అన్నారు.


More Telugu News