సిద్ధిపేట పోలీసుల వైఖరిపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. నివేదిక ఇవ్వండి అంటూ తెలంగాణ డీజీపీకి ఆదేశాలు

  • నిన్న సిద్ధిపేటలో పోలీసుల సోదాలు
  • రఘునందన్ రావు మామ నివాసంలో నగదు స్వాధీనం
  • భగ్గుమంటున్న బీజేపీ వర్గాలు
సిద్ధిపేటలో తమ అనుయాయుల ఇళ్లలో పోలీసులు సోదాలు జరపడాన్ని బీజేపీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది.  ముఖ్యంగా, దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మామ నివాసంలో రూ.18 లక్షలు దొరకడం, ఈ సందర్భంగా పోలీసుల వ్యవహార శైలి బీజేపీ వర్గాలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దానికి తోడు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంతో కాషాయదళం భగ్గుమంటోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సిద్ధిపేట పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. ఈ సోదాలపై నివేదిక ఇవ్వాలని, బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియజేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఏంటని ప్రశ్నించారు. సివిల్ డ్రెస్సుల్లో పోలీసులు ఎందుకు వెళ్లారని కిషన్ రెడ్డి నిలదీశారు.

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనడానికి ఈ ఘటనలే నిదర్శనమని అన్నారు. సిద్ధిపేట ఘటనలను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల దృష్టికి తీసుకెళతామని తెలిపారు.


More Telugu News