కుటుంబసభ్యులతో కలిసి సముద్రంలో ఏపీ మంత్రి చేపలవేట

  • సీదిరి అప్పలరాజు ఆటవిడుపు
  • దసరా సందర్భంగా భావనపాడు పోర్టుకు వెళ్లిన వైనం
  • చేపలు పట్టి మురిసిపోయిన మంత్రి
శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో అనూహ్యరీతిలో మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. మంత్రి హోదాలో ఉన్నా సరే ఆయన తన కులవృత్తిని మర్చిపోలేదు. దసరా సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో కలిసి సముద్రంలో సరదాగా చేపలవేట సాగించారు. వల విసిరి కొన్ని చేపలు కూడా పట్టి మురిసిపోయారు.

మత్స్యకార కుటుంబంలో పుట్టిన అప్పలరాజు చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారు. దాంతో ఆయన తన కుటుంబసభ్యుల్లా చేపలవేటలో పాలుపంచుకోలేకపోయారు. అధికభాగం చదువుతోనే సాగింది. ఆ తర్వాత వైద్య వృత్తి, ఆపై రాజకీయాలు, ఇటీవల మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖ మంత్రి పదవితో మరింత బిజీ అయ్యారు.

అయితే దసరా పండుగ సందర్భంగా ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి భావనపాడు పోర్టును సందర్శించారు. అక్కడ తన సోదరుడు చిరంజీవి, చిన్ననాటి మిత్రులతో కలిసి సముద్రంలోకి వెళ్లి చేపల వేట సాగించారు. సముద్రతీరంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భోజనాలు చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు ఎంతో ఉల్లాసంగా గడిపారు.


More Telugu News