కొనసాగుతున్న బండి సంజయ్ నిరసన దీక్ష.. సీపీని సస్పెండ్ చేసే వరకు కొనసాగుతుందన్న బీజేపీ తెలంగాణ చీఫ్

  • దుబ్బాకలో బీజేపీ విజయం స్పష్టం కావడంతోనే టీఆర్ఎస్ అరాచకాలు 
  • పోలీసులే డబ్బులు పెట్టి దొరికినట్టు చూపిస్తున్నారు
  • కేంద్ర బలగాలను రప్పించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
తనతో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా గత రాత్రి చేపట్టిన దీక్షను బీజేపీ చీఫ్ బండి సంజయ్ కొనసాగిస్తున్నారు. రాత్రంతా నేలపై నిద్రపోయి నిరసన తెలిపిన ఆయన సీపీని సస్పెండ్ చేసేంత వరకు దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. సంజయ్‌ దీక్షకు సంఘీభావంగా కార్యకర్తలు కూడా ఎంపీ కార్యాలయం వెలుపల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను సిద్ధిపేటకు బయలుదేరితే సీపీ జోయల్ డేవిస్ తనపై దాడిచేయడమే కాకుండా అక్రమంగా కరీంనగర్‌కు తరలించారని ఆరోపించారు.

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయమని తేలిపోవడం వల్లే టీఆర్‌ఎస్ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, ఆయన బంధువుల ఇళ్లలో పోలీసులే డబ్బులు పెట్టి అవి దొరికినట్టు చూపించారని ఆరోపించారు. సిద్దిపేట ఘటనపై ఎన్నికల సంఘం స్పందించాలని, కేంద్రం నుంచి బలగాలను రప్పించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. కాగా, సంజయ్‌పై దాడికి నిరసనగా నేడు ప్రగతి భవన్‌ ముట్టడికి ఏబీవీపీ, బీజేవైఎం పిలుపునిచ్చాయి.


More Telugu News