రాజస్థాన్ లో దారుణం... జీతం అడిగిన ఉద్యోగిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యజమాని!

  • ఐదు నెలల జీతం ఇవ్వని మద్యం దుకాణం యజమాని
  • నిలదీసిన సేల్స్ మన్
  • సజీవదహనం చేసిన యజమాని
రాజస్థాన్ లో ఓ మద్యం షాపులో సేల్స్ మన్ గా పనిచేసే ఉద్యోగిపై యజమాని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. అల్వార్ నగరంలోని ఖైర్ థాల్ ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణంలో కమలేశ్ అనే వ్యక్తి సేల్స్ మన్ గా పనిచేస్తున్నాడు. ఐదు నెలలు పనిచేసినా జీతం ఇవ్వకపోవడంతో కమలేశ్ తన యజమానిని నిలదీశాడు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మద్యం దుకాణ యజమాని కమలేశ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

దాంతో తనను తాను రక్షించుకునేందుకు కమలేశ్ దుకాణంలో ఉన్న డీప్ ఫ్రీజర్ లోకి వెళ్లాడు. అప్పటికే శరీరంలో అధికభాగం కాలిపోవడంతో కమలేశ్ మృతి చెందాడు. కాగా, కమలేశ్ దళితుడు కావడంతో ఈ ఘటనపై రాజస్థాన్ దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News