బండి సంజయ్ అరెస్ట్... ఖండించిన పవన్ కల్యాణ్

  • దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో హోరాహోరీ
  • సిద్ధిపేటలో పోలీసుల సోదాలు
  • సోదాలను ఖండించిన బండి సంజయ్
దుబ్బాక ఉప ఎన్నికలను అన్ని పార్టీలు తీవ్రంగా పరిగణిస్తుండడంతో వాడీవేడి వాతావరణం నెలకొంది. ఇవాళ సిద్ధిపేటలో సోదాలు జరిగిన నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల నివాసాలపై పోలీసులు దాడులు చేయడంపై బీజేపీ నాయకత్వం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సిద్ధిపేటకు బయల్దేరారు.

దాంతో సంజయ్ ను పోలీసులు నిలువరించారు. ఆయన ముందుకు వెళ్లేందుకే సిద్ధపడడంతో అరెస్ట్ చేసి వ్యాన్ లో ఎక్కించారు. అయితే వ్యాన్ లో ఎక్కించే సమయంలో తోపులాట జరిగి సంజయ్ గాయపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన పెద్దగా కేకలు వేయడంతో బీజేపీ కార్యకర్తలు దూసుకువచ్చారు. దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, రఘునందన్ రావు బంధువుల నివాసాల్లో పోలీసుల సోదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగేది దుబ్బాకలో అయితే సిద్ధిపేటలో సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం: పవన్ కల్యాణ్

 తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజస్వామికం అని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ పైనా, బీజేపీ నేతలపైనా పోలీసుల చర్యలు పలు సందేహాలకు తావిస్తున్నాయని తెలిపారు. ఉద్రిక్తతలకు దారితీసేలా అధికారుల వ్యవహార శైలి ఉందని విమర్శించారు. ఎన్నికల నియమావళి, నిబంధనలు అన్ని పార్టీలకు ఒకేలా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News