నీరవ్ మోదీకి మళ్లీ నిరాశే... లండన్ కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణ

  • పీఎన్బీకి వేల కోట్ల మేర టోకరా వేసిన నీరవ్
  • ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి
  • నవంబరు 3 వరకు రిమాండ్
పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసగించి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం యూకే జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, నీరవ్ మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, లండన్ కోర్టు అతని అభ్యర్థనను తిరస్కరించింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

ఈ నెల మొదట్లో జరిగిన విచారణలో నీరవ్ మోదీ రిమాండ్ ను యూకే కోర్టు మరింత పొడిగించింది. తదుపరి విచారణ నవంబరు 3న జరగనుండగా, అప్పటివరకు రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొంది.

కాగా, గతనెలలో జరిగిన విచారణలో నీరవ్ మోదీ న్యాయవాది కోర్టుకు పలు అంశాలు నివేదించారు. రాజకీయపరమైన ఒత్తిళ్ల కారణంగా భారత్ లో విచారణ సజావుగా సాగే అవకాశాలు లేవని, పైగా అక్కడి జైళ్లలో సరైన వైద్య సదుపాయాలు లేని పరిస్థితుల కారణంగా తన క్లయింటు ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలున్నాయని కోర్టును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు.

49 ఏళ్ల నీరవ్ మోదీని భారత్ తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరింది. కాగా, నవంబరు 3న జరిగే విచారణలో నీరవ్ మోదీని భారత్ కు అప్పగించడంపై వాదనలు జరగనున్నాయి. లండన్ కారాగారంలో ఉన్న నీరవ్ మోదీ ఈ విచారణకు వీడియో లింక్ ద్వారా హాజరుకానున్నారు.


More Telugu News