రామ్ సినిమా శాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ రేటు

  • కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ 'రెడ్'
  • హీరోయిన్లుగా నివేద, మాళవిక, అమృత  
  • వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదల
  • శాటిలైట్, డిజిటల్ హక్కులకు 13.5 కోట్లు   
'ఇస్మార్ట్ శంకర్' సినిమా తర్వాత యంగ్ హీరో రామ్ నటిస్తున్న చిత్రం 'రెడ్'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓటీటీ నుంచి డైరెక్టు రిలీజ్ కోసం ఆకర్షణీయమైన ఆఫర్లు వచ్చినప్పటికీ నిర్మాత ఇవ్వలేదు. హీరో రామ్ థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉండడంతో ఆ ఆఫర్లను తిరస్కరించారు.

ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు నిన్న చిత్ర నిర్మాత అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ఇదిలావుంచితే, ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్, డిజిటల్ హక్కులకు మంచి ఫ్యాన్సీ రేటు పలికినట్టు తెలుస్తోంది. 13.5 కోట్లు ఆఫర్ చేసి ఆ హక్కులను జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ కోవిడ్ రెసిషన్ సమయంలో రామ్ చిత్రానికి ఇంత రేటు రావడం గొప్పేనని అంటున్నారు.

 ఈ 'రెడ్' సినిమాలో రామ్ సరసన నివేద పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ డబుల్ రోల్స్ చేస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.


More Telugu News