గతంలో అగ్గిపెట్టెలాంటి ఇళ్లను పేదలకు ఇచ్చేవారు!: తెలంగాణ మంత్రి కేటీఆర్

  • హైదరాబాద్‌లోని జియాగూడలో సామూహిక గృహప్రవేశాలు
  • రెండు పడక గదుల డిగ్నిటీ హౌసింగ్ కాలనీ ప్రారంభం
  • తాము డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగా ఇస్తున్నామన్న కేటీఆర్
  • అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వ్యాఖ్య
గతంలో ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే ఇళ్లు అగ్గిపెట్టెల్లా, డబ్బాల్లా ఉండేవని, తాము డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని జియాగూడలో రెండు పడక గదుల డిగ్నిటీ హౌసింగ్ కాలనీని కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ప్రారంభించారు.

లబ్ధిదారులు సామూహిక గృహప్రవేశాలు చేశారు. ఈ డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో 840 ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పేదల సొంత ఇంటి కలను ప్రభుత్వం విజయదశమి కానుకగా సాకారం చేసిందని అన్నారు.  ఈ కాలనీలో రూ.71.49 కోట్ల వ్యయంతో 840  ఇళ్లు నిర్మించారని తెలిపారు. ఇందులో తాగునీరు, విద్యుత్, సీసీ రోడ్లు, షాపింగ్ కాoప్లెక్స్‌తో పాటు బస్తీ దవాఖానా సదుపాయాలు కూడా ఉన్నాయని చెప్పారు.  

తమ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్ల రూపాయలతో 2,75,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతుందని చెప్పారు. వాటి పంపిణీ పారదర్శకంగా ఉంటుందని, ఈ విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. జీహెచ్‌ఎంసీలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను దశల వారిగా ఇస్తామని కేటీఆర్ చెప్పారు.

గత ప్రభుత్వాల హయాంలో డబ్బా ఇళ్లు కట్టేవారని, వాటిలోనే అవినీతి జరిగేదని చెప్పారు. అంతేగాక, కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కట్టకుండానే కట్టినట్లు చూపించి, డబ్బులు దండుకున్నారని విమర్శించారు. తాము పైసా చెల్లించే అవసరం లేకుండానే పేదలకు ఇళ్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. తాము కట్టించిన ఇళ్లలో ఒక్కోదానికి సర్కారు రూ.9 లక్షలు ఖర్చుచేసిందని తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే తాము ఇళ్లు కట్టి ఇస్తున్నామని చెప్పారు.


More Telugu News