ఇండియాకు బయలుదేరిన మైక్ పాంపియో!

  • పాంపియోతో పాటు రక్షణ మంత్రి కూడా
  • నాలుగు దేశాల్లో పర్యటన
  • సిద్ధంగా ఉండాలని పాంపియో ట్వీట్
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత పర్యటనకు బయలుదేరారు. అమెరికా అధ్యక్ష ఎన్నిక నవంబర్ 3న జరుగనున్న నేపథ్యంలో పాంపియో భారత్ తో పాటు శ్రీలంక, మాల్దీవులు, ఇండొనేషియా దేశాల్లో పర్యటించాలని నిర్ణయించుకోవడం, ఆయన వెంట రక్షణ మంత్రి టీ ఎస్పర్ కూడా ఉండటంతో చైనాకు చెక్ చెప్పేందుకు కొత్త నిర్ణయాలతో ఆయన వస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక నిన్న రాత్రి అమెరికా నుంచి బయలుదేరిన మైక్ పాంపియో, తన ట్విట్టర్ ఖాతాలో విమానం ఫోటోలను ఉంచారు. "సిద్ధంగా ఉండండి. నేను ఇండియాకు వస్తున్నా. శ్రీలంక, మాల్దీవులు, ఇండొనేషియాలకు కూడా. ఈ అవకాశం నాకు దక్కినందుకు నాకెంతో ఆనందంగా ఉంది, ఆయా దేశాలతో భాగస్వామ్యాలను పెంచుకునేందుకు ఈ పర్యటన దోహదపడనుంది. ఇండో పసిఫిక్ రీజియన్ లో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం నిండివున్నాయి" అని అన్నారు.

కాగా, మైక్ పాంపియో, ఎస్పర్ లతో భారత విదేశాంగ, రక్షణ మంత్రుల చర్చలు నేడు జరగనున్నాయి. ఇది అమెరికా, ఇండియాల మధ్య ఇద్దరు కేంద్ర మంత్రుల స్థాయిలో జరుగుతున్న మూడవ విడత చర్చలు. రేపు రాజ్ నాథ్ సింగ్, ఎస్ జైశంకర్ లు పాంపియో, ఎస్పర్ జోడీతో కీలకమైన చర్చలు సాగించనున్నారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీని కూడా అమెరికా మంత్రులు కలుస్తారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోనూ పాంపియో మాట్లాడనున్నారు.


More Telugu News