గీతం కూల్చివేతలో కక్షసాధింపు లేదు.. పోలవరం కట్టి తీరుతాం: బొత్స

  • ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారికి వత్తాసు పలుకుతున్నారు
  • కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం పూర్తి చేస్తాం
  • త్వరలోనే విశాఖ మెట్రో రైట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం
విశాఖలోని గీతం యూనివర్శిటీకి చెందిన కొన్ని కట్టడాలను కూల్చివేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. నోటీసులు కూడా ఇవ్వకుండానే అర్ధరాత్రి పూట నిర్మాణాలను కూల్చడం ముఖ్యమంత్రి జగన్ ఫాసిస్టు ధోరణికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, గీతం వర్శిటీ కూల్చివేతల వెనుక ఎలాంటి కక్షసాధింపులు లేవని అన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారికి వత్తాసు పలకడం సరికాదని చెప్పారు.

భూములను కబ్జా చేసిన వారి వివరాలను అందిస్తే, వారిపై విచారణ చేపట్టి విచారణ జరుపుతామని అన్నారు. వైసీపీ వారు అయినా తప్పు చేస్తే ఉపేక్షించబోమని చెప్పారు. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటే... విమర్శలు చేయడం సరికాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

విశాఖలో మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను సిద్ధం చేస్తామని... ఆ తర్వాత టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు. పీపీఏ పద్ధతిలో నిర్మించాలా? లేక ప్రభుత్వమే నిర్మాణం చేపట్టాలా? అనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు.


More Telugu News