ప్రముఖుల విజయ దశమి శుభాకాంక్షలు.. మోదీ సందేశం

  • చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం: రాష్ట్రపతి
  • ప్రజల్లో జీవితాల్లో శాంతి, సామరస్యం వెల్లివిరియాలి: వెంకయ్య
  • పండుగ రోజు ప్రజలు ఇళ్లలో దీపాలు వెలిగించాలి
  • సైనికులకు మద్దతు తెలపాలి: మోదీ
దసరా సందర్భంగా ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితులు తొలగిపోవాలని ఆయన కోరుకున్నారు. దసరా ఆత్మీయులందరితో కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ దసరా పండుగను జరుపుకోవాలని చెప్పారు. ప్రజల జీవితాల్లో శాంతి, సామరస్యం వెల్లివిరియాలని కోరారు.

కాగా,  ఈ దసరా ప్రజలకు స్ఫూర్తినివ్వాలని ప్రధాని మోదీ  ఆకాంక్షించారు. మన్ కీ బాత్ లో ఆయన మాట్లాడుతూ... సరిహద్దుల్లో సైనికుల సేవలు, ధైర్య సాహసాలను పండుగ సమయాల్లో మరోసారి గుర్తుచేసుకోవాలని చెప్పారు. దీపావళి, ఈద్‌ వంటి పండుగల సమయంలోనూ సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశాన్ని కాపాడుతున్నారని ఆయన తెలిపారు.

వారికి మద్దతుగా పండుగ రోజు ప్రజలు ఇళ్లలో దీపాలు వెలిగించాలని చెప్పారు. కరోనా నేపథ్యంలో పండుగలు జరుపుకొనేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈ పోరులో మనం తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పారు. దేశ ప్రజలు స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను కొనాలని ఆయన తెలిపారు.  పండుగ సందర్భాల్లో స్థానిక వస్తువులనే కొనుగోలు చేయాలన్నారు.




More Telugu News