ప్రభుత్వాన్ని కాదని నిమ్మగడ్డ రమేశ్ ఏమీ చేయలేరు: మంత్రి కొడాలి నాని

  • స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు
  • కరోనా సెకండ్ వేవ్ వస్తుందంటున్నారు
  • నేను చెప్పిందే వేదం అన్నట్టుగా రమేశ్ వ్యవహరిస్తున్నారు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతుండగా... రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వచ్చే నెల 4వ తేదీ లోపు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో, ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని పార్టీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. దసరా తర్వాత కరోనా వైరస్ సెకండ్ వేవ్ రానుందని నిపుణులు చెపుతున్నారని తెలిపారు. కరోనా వల్ల గతంలో మాదిరి ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని తరలించడం సాధ్యం కాదని... ప్రజలు కూడా ఓటు వేసేందుకు వచ్చే పరిస్థితి లేదని అన్నారు.

ఇదే సమయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పై ఆయన విమర్శలు గుప్పించారు. తాను చెప్పిందే వేదం అనే విధంగా రమేశ్ వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కొన్ని నెలల పాటే రమేశ్ ఉంటారని... ఆ తర్వాత రిటైర్ అయి హైదరాబాదులో ఉంటారని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ప్రజల శ్రేయస్సే ముఖ్యమని అన్నారు. తాను చెప్పిందే రాజ్యాంగం అని నిమ్మగడ్డ అనుకోవడం సరి కాదని... రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఆయన ఏమీ చేయలేరని చెప్పారు.


More Telugu News